Type Here to Get Search Results !

దళిత, ఆదివాసీలకు సమానత్వమే క్రీస్తు బోధన.. మెదక్ చర్చిలో ఘనంగా ప్రత్యేక ఆరాధనలు

 



మెదక్ చర్చిలో ఘనంగా దళిత, ఆదివాసీ ఆదివారం ఆరాధనలు

మెదక్, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం దళిత, ఆదివాసీ ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే చర్చి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఉదయం జరిగిన ఆరాధనలో డయాసిస్ దళిత, ఆదివాసీ సెక్రటరీ రెవ. ఆర్. సొలొమోను రాజ్ పాస్టర్ ప్రత్యేక ప్రసంగం చేశారు. రెండవ ఆరాధనలో రెవ. ఆర్. ఇమానుయేలు పాస్టర్ ప్రసంగిస్తూ దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాల పట్ల సమాజం చూపించాల్సిన ప్రేమ, గౌరవం, బాధ్యతను వివరించారు.

ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ.. విరిగి నలిగిన ప్రజల పక్షాన యేసుక్రీస్తు ప్రభువు నిలిచినట్లుగానే, నేటి సమాజంలో బలహీనులు, పేదలు, అణగారిన ప్రజల పక్షాన ప్రభుత్వం, సమాజం నిలవాలని అన్నారు. అంటరానితనం, వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.

“దేవుని దృష్టిలో పక్షపాతం లేదు.. ప్రతి మనిషి దేవుని సృష్టే” అనే బైబిల్ సందేశాన్ని భక్తులకు వివరించారు. యేసుక్రీస్తు సమాజంలో పక్కకు నెట్టబడిన వారిని దగ్గరకు తీసుకుని ప్రేమతో ఆదరించిన విషయాన్ని గుర్తుచేశారు. సమాజం వెలివేసిన వారిని క్రీస్తు అంగీకరించారని, బాధలో ఉన్నవారిని పరామర్శించి వారికి ధైర్యం ఇచ్చారని తెలిపారు.

“నీ పొరుగువానిని నీవలె ప్రేమించాలి” అనే యేసుక్రీస్తు బోధనను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మనకు ఇష్టమైన వారినే కాకుండా, మనకు భిన్నంగా ఉన్నవారిని కూడా ప్రేమించాలని సూచించారు.

అలాగే “బలహీనులకు బలంగా నిలబడాలి, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వాలి, బాధపడుతున్నవారిని ఆదుకోవాలి” అనే క్రీస్తు బోధనలను గుర్తుచేస్తూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పాస్టర్లు పిలుపునిచ్చారు.

రెండు ఆరాధనల్లో స్థానిక ప్రెసిబిటర్ ఇన్‌చార్జి రెవ. శాంతయ్య, రెవ. డేవిడ్, రెవ. జైపాల్, రెవ. శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక చర్చి సెక్రటరీ గెలన్, ట్రెజరర్ సంపత్, పాస్టరేట్ స్టీవార్డు ప్రభుదయ, చర్చి స్టీవార్డు దేవప్రకాశ్‌తో పాటు చర్చి కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

దళితులు, ఆదివాసీలు, పేదలు, అణగారిన వర్గాల పట్ల వివక్ష లేకుండా సమాన హక్కులు, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని పాస్టర్లు పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, సమానత్వం, సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఆరాధనలతో మెదక్ చర్చిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దళిత, ఆదివాసీ సమాజాల అభ్యున్నతి, సమానత్వం కోసం ప్రార్థనలు నిర్వహించారు.

తెలుగు ట్రెండ్స్ – మెదక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language