నిరుద్యోగ యువత భవితకు MESIC పోర్టల్ భరోసా
తూప్రాన్, ఆగస్టు 17 (తెలుగు ట్రెండ్స్): నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి నైపుణ్యాలకు అనుగుణంగా పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా మెదక్ ఎంప్లాయ్‌మెంట్, స్కిల్స్ & ఇండస్ట్రీ కనెక్ట్ (MESIC) పోర్టల్ ఉపయోగపడుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటిక్స్ పరిశ్రమలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేక చొరవతో రూపొందించిన MESIC పోర్టల్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేలా అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తోందన్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, నైపుణ్య సంస్థలు, స్థానిక పరిశ్రమలను ఒకే ధృవీకరించబడిన వ్యవస్థ ద్వారా అనుసంధానించడమే MESIC పోర్టల్ ముఖ్య ఉద్దేశమన్నారు.
జిల్లా కలెక్టరేట్‌కు చెందిన ఐటీ బృందం, ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో MESIC పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో సమీకృత ఉపాధి, నైపుణ్య వేదికను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణలోని తొలి జిల్లాల్లో మెదక్ ఒకటిగా నిలిచిందన్నారు.
మెదక్ జిల్లాలోని ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు MESIC రెండు-ట్రాక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అందిస్తుందని మంత్రి వివరించారు. విద్యార్థుల ధృవీకరించబడిన ప్రొఫైళ్లను పరిశ్రమల్లోని ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేయడం ద్వారా సరైన ఉద్యోగాన్ని పొందేందుకు ఈ పోర్టల్ దోహదపడుతుందన్నారు. విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ను సంబంధిత విద్యాసంస్థలు ధృవీకరించిన అనంతరం మాత్రమే ప్రొఫైల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే విధానం ఉంటుందని తెలిపారు. ప్రతి కళాశాల నుంచి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ప్లేస్‌మెంట్ మేనేజర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ, యువతలో చాలామందికి తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఏ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సమాచారం లేక హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు MESIC పోర్టల్ ఉపయోగపడుతుందని తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగ యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని పరిశ్రమలకు కూడా పోర్టల్‌లో లాగిన్, పాస్‌వర్డ్‌లు అందిస్తున్నామని, పరిశ్రమలు తమ ఉద్యోగ అవసరాలను నమోదు చేయడం ద్వారా స్థానిక యువతకు అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, ఏఎల్‌ఏ చైర్‌పర్సన్ సుబ్బారావు, ఐటీసీ ప్రతినిధి ఆనంద్, ఈడీఎం సందీప్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్
తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్


కామెంట్‌ను పోస్ట్ చేయండి