ఐడీ కార్డులు చూపిస్తూ 'ఇంటెలిజెన్స్ పోలీసులు'మని హల్‌చల్.. కలెక్టర్ ఫిర్యాదుతో ఇద్దరు అదుపులో
మెదక్, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నకిలీ పోలీసులుగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను మెదక్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
సమాచారం ప్రకారం, గత రెండు వారాలుగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్, శ్రీనాథ్ అనే ఇద్దరు వ్యక్తులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ వద్ద ఉన్న ఐడీ కార్డులను చూపిస్తూ "మేము ఇంటెలిజెన్స్ పోలీసులం" అని చెప్పినట్లు సమాచారం. అలాగే తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తూ, "మేము పోలీసులం.. మా పనులు త్వరగా చేయాలి" అంటూ అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది.
అయితే వారి ప్రవర్తన, చెప్పిన వివరాలు అనుమానాస్పదంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమై మెదక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మెదక్ రూరల్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వారు చూపించిన ఐడీ కార్డులు నిజమైనవేనా? వారు నిజంగా ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వారేనా? లేక పోలీసుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
తెలుగు ట్రెండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి