బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ.. సంగారెడ్డిలో హోరెత్తిన నినాదాలు
సంగారెడ్డి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు ‘శుద్ధీకరణ’ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కుల, మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొడతామని నాయకులు స్పష్టం చేశారు.
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, నేరెళ్ల శారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, దుద్దిళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయం సమీపంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత, సౌహార్దం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడుతారని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోర్ మాట్లాడుతూ.. చంద్ర మండలానికి ప్రయాణిస్తున్న ఆధునిక కాలంలో కూడా బీజేపీ నేతలు దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే ద
ళితుడు కావడం వల్లే వేదికను ‘శుద్ధీకరణ’ చేశారని విమర్శించారు. కులం, మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారని రాథోర్ తెలిపారు. సమాజంలో ఐక్యత, పరస్పర సౌహార్దం, సామరస్యం కొనసాగేందుకు కాంగ్రెస్ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై..
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని దీపక్ రాథోర్ తెలిపారు. మరో 5 నుంచి 7 రోజుల పాటు జిల్లాలో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తామని, అనంతరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
తెలుగు ట్రెండ్స్



కామెంట్‌ను పోస్ట్ చేయండి