మెదక్ జర్నలిస్టులకు ఎస్పీ కితాబు.. ‘ది బెస్ట్’ అంటూ ప్రశంస

 


మెదక్ జర్నలిస్టులు ది బెస్ట్..: ఎస్పీ శ్రీనివాసరావు

పోలీసులు–మీడియా పరస్పర సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు

సైబర్‌ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

మెదక్, ఆగస్టు 11 (తెలుగు ట్రెండ్స్):
ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసులు, మీడియా పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. తాను పనిచేసిన ప్రాంతాలతో పోలిస్తే మెదక్ జిల్లా జర్నలిస్టులు ది బెస్ట్ అని ప్రశంసించారు.

మంగళవారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మెదక్ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శివ్వన్నగారి నర్సింహాచారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్తో పాటు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులను ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుంటున్నారని తెలిపారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్‌, సందేశాలు, అనుమానాస్పద లింకుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్‌, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

డ్రగ్స్‌పై నిఘా

మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని ఎస్పీ హెచ్చరించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా డ్రగ్స్‌ వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం

జిల్లాలో నేరాల నియంత్రణకు రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సీఐలు, ఆర్‌ఐలు రాత్రివేళల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మానవ తప్పిదాలు, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగానే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు కొనసాగుతున్నాయని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం

మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థినుల్లో చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

పోలీసుల కృషి అభినందనీయం

మెదక్ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శివ్వన్నగారి నర్సింహాచారి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు భద్రత, దొంగతనాల నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల ద్వారా ప్రజలకు భద్రత కల్పిస్తున్నారని ప్రశంసించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులకు పోలీసు శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌, కోశాధికారి చెవిటి అశోక్‌, సీనియర్ జర్నలిస్టులు కామాటి కృష్ణ, నీలం, శ్రీధర్‌, సందీప్‌, రమేష్‌, సిద్దు, రాజాగౌడ్‌, రహమత్‌, నర్సింలు, లక్ష్మీనారాయణ, గోవర్ధన్‌, శ్రీకాంత్‌, ఫణిరాజ్‌, శ్రీహరిగౌడ్‌, కార్తీక్‌, సుబ్బు, మల్లేశం, ఫసి, మల్లికార్జున్‌, లక్ష్మణ్‌, రాజశేఖర్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads