పోచమ్మ దేవాలయం అంధకారంలో.. బోనాల వేళ భక్తుల అవస్థలు

 



పోచమ్మ దేవాలయం అంధకారంలో.. భక్తులకు ఇబ్బందులు

బోనాల జాతర వేళైనా వీధిలైట్లు వెలిగించరా? అధికారులపై పట్టణ ప్రజల ఆగ్రహం

తెలుగు ట్రేండ్స్ | జోగిపేట, ఆగస్టు 10:

దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని గ్రామదేవత పోచమ్మ దేవాలయం మాత్రం సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దేవాలయం పరిసరాల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో భక్తులు, స్థానికులు చీకట్లోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

జోగిపేట పట్టణ ప్రజలు గ్రామదేవతగా కొలిచే పోచమ్మ తల్లికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తెలుగు ప్రజలు పండుగలు, శుభకార్యాల సమయంలో గ్రామదేవతలను కొలిచే సంప్రదాయం కొనసాగుతోంది. జోగిపేట పట్టణంలో కూడా ఏ వీధిలో పెళ్లి జరిగినా పోచమ్మ దేవాలయంలో కొలువైన అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ మాసం వచ్చిందంటే పోచమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ప్రస్తుతం బోనాల జాతర కొనసాగుతున్న నేపథ్యంలో దేవాలయానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగాయి.

అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయంలో వెలిగి వెలగని బల్బులు, పనిచేయని వీధిలైట్లతో చీకటి వాతావరణం నెలకొనడం పట్ల భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవాలయం వెనుక భాగంలో కూడా వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

ఈ దేవాలయం మున్సిపల్ పరిధిలోని 17, 18వ వార్డుల మధ్యలో ఉంది. వీధిలైట్ల సమస్యను రెండు వార్డుల కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బోనాల జాతర సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయం చుట్టూ తగినంత వెలుతురు ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బోనాల జాతర వేళైనా పోచమ్మ దేవాలయానికి వెలుగులు వస్తాయా? అధికారుల స్పందన కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.

0/Post a Comment/Comments

ads

ads