మెదక్ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా గాంతి అశోక్
మనోహరాబాద్, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామానికి చెందిన ఆరో వార్డు సభ్యుడు గాంతి అశోక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పరికిబండ, గౌతోజీగూడెం, పోతారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
గాంతి అశోక్‌కు నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా గాంతి అశోక్ ఎన్నిక కావడం పరికిబండ గ్రామంతో పాటు మనోహరాబాద్ మండలానికి గర్వకారణమన్నారు. వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. వార్డు సభ్యుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఫోరం ద్వారా గాంతి అశోక్ చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
ఈ సందర్భంగా గాంతి అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వార్డు సభ్యులతో కలిసి పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌతోజీగూడెం సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ ఎర్ర నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట మహేందర్, మంచ శ్రీరామ్, యెషం భగవాన్, నిమ్మల యాదగిరి, కర్కాల సత్యనారాయణ రెడ్డి, నిమ్మల శ్రీశైలం, బొల్లాబోయిన నర్సింలు, చింతల ఆనంద్, గోనెగరి నవీన్ గౌడ్, గండి మహేష్, తూముకుంట శ్రీశైలం, గాంతి క్రాంతికుమార్, సాలిపేట నాగరాజు, సురేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి