కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సంక్షేమ ఫలాలు అమలు చేయాలి
తూప్రాన్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): మున్సిపల్ పరిపాలన శాఖ విడుదల చేసిన సర్కులర్ ప్రకారం తూప్రాన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సంక్షేమ సౌకర్యాలను అమలు చేయాలని సీఐటీయూ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు గజ్జల బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కార్మికులతో కలిసి తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గజ్జల బాబు మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి జారీ చేసిన సర్కులర్ ప్రకారం తూప్రాన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం కల్పించిన సంక్షేమ వసతులను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్‌కు సంబంధించిన కార్మికులు, యాజమాన్య వాటాలను ప్రతినెలా సకాలంలో జమ చేసి, వాటికి సంబంధించిన స్లిప్పులను అందజేయాలని అన్నారు.
అలాగే కార్మికుల వేతనాల నుంచి డిడక్ట్ చేసిన ఏరియర్స్ మొత్తాన్ని క్రమం తప్పకుండా సంబంధిత ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు విధుల సమయంలో అవసరమైన మాస్కులు, గ్లౌజులు, నూనె, సబ్బులు, చెప్పులు తదితర రక్షణ పరికరాలను క్రమం తప్పకుండా అందించాలని డిమాండ్ చేశారు.
నిబంధనల ప్రకారం కార్మికులకు ఏడాదికి 15 రోజుల సాధారణ సెలవులను వేతన కోత లేకుండా మంజూరు చేయాలని, రొటేషన్ పద్ధతిలో వారానికి ఒకరోజు వారపు సెలవు కల్పించాలని కోరారు. అలాగే సంవత్సరానికి 8 జాతీయ పండగల సెలవులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తూప్రాన్ మున్సిపాలిటీ కార్మికులకు అన్ని సంక్షేమ సౌకర్యాలు అందేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు గజ్జల బాబు, ప్రధాన కార్యదర్శి గజ్జల కృష్ణ కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్ | తెలుగు ట్రెండ్స్



కామెంట్‌ను పోస్ట్ చేయండి