స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
గతంలో రాష్ట్రంలో 2.81 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసి మరో 62 లక్షల మందికి ప్రయోజనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3.42 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ఈసారి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సును నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం
వానాకాలం పంటలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రకాల సాగును పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది.
యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ప్రభుత్వం తెలిపింది. ఈసారి రికార్డు స్థాయిలో 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఇందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ప్రభుత్వం సేకరించనుండగా.. మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈ మిగులు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు.
స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు
రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థలను ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేయాలని నిర్ణయించింది.
కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లకు గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 86 స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి.
హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు రూ.200 కోట్ల పథకం
హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు కాలుష్య నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవడం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
కాలుష్య పరిశ్రమల తరలింపునకు గడువు పొడిగింపు
హైదరాబాద్ సిటీ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తు గడువును మరో మూడు నెలలు పొడిగించారు. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులకు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సౌకర్యం కల్పించనున్నారు.
అలాగే గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
తెలుగు ట్రెండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి