వెల్దుర్తి బంద్‌తో ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక

తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో ఆందోళన.. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు

వెల్దుర్తి, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):

వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మండల పరిధిలోని కుక్కునూరు గ్రామానికి తరలించే ప్రతిపాదనకు నిరసనగా మంగళవారం వెల్దుర్తి మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ నిర్వహించారు. వ్యాపారులు, విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.

బంద్‌కు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేసి ప్రజా ఐక్యతను చాటారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

"మండల కేంద్రానికే మంజూరైన పాఠశాల.. మండల కేంద్రంలోనే ఉండాలి", "విద్య అందరికీ అందుబాటులో ఉండాలి", "మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు", "విద్యార్థులకు న్యాయం చేయాలి", "తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే కొనసాగించాలి" అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, వెల్దుర్తి మండల కేంద్రానికి ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కునూరు గ్రామానికి తరలించరాదని స్పష్టం చేశారు. మంజూరైన పాఠశాలను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసి, భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేయడం వల్ల మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు లభిస్తాయని, రవాణా సౌకర్యాలు, పరిపాలనా అనుకూలత, విద్యార్థులు, తల్లిదండ్రుల సౌలభ్యం దృష్ట్యా ఇదే సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

ఇది రాజకీయాలకు అతీతమైన ప్రజా ప్రయోజన అంశమని, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రజల ఆకాంక్షను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే కొనసాగిస్తూ, భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాంబండ శేఖర్, శేఖర్ గౌడ్, మహేందర్ గౌడ్, చందు, శ్రీనివాస్ రెడ్డి, కర్రి వెంకటేశం, నవీన్, రాఘవేంద్ర, ప్రొప్రైటర్ రమేష్ గుప్తా, అశోక్ రెడ్డి, కేపీ గణేష్, గుప్తా కిచ్చు, శ్రీను, సుధాకర్ గుప్తా, చిన్న రమేష్ గుప్తాతో పాటు గ్రామ యువకులు, వార్డు సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads