కోనాపూర్ అభివృద్ధి దేవేందర్ రెడ్డి హయాంలోనే.. అవినీతి ఆరోపణలు రాజకీయ దుష్ప్రచారమే: మాజీ వైస్ చైర్మన్ హరికృష్ణ
విచారణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.. దళిత–రెడ్డి వివాదాన్ని కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపన
రామాయంపేట ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):
కోనాపూర్ గ్రామ అభివృద్ధితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పురోగతి మాజీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి హయాంలోనే సాధ్యమైందని, ప్రస్తుతం ఆయనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ హరికృష్ణ పేర్కొన్నారు. సోమవారం కోనాపూర్ గ్రామంలో రైతులు, గ్రామ పెద్దలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హయాంలో ఎస్సీ కాలనీ నుంచి పెద్దతాండా, చిన్నతాండా వరకు బీటీ రోడ్లు, గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, డంపింగ్ యార్డ్, నర్సరీ, స్మశానవాటిక, బీసీ బంధు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాం, రెండు ప్రాంతాల్లో 20కిపైగా దుకాణాలు, పెట్రోల్ బంక్ వంటి శాశ్వత ఆస్తులు నిర్మించి సంఘానికి స్థిర ఆదాయ వనరులు కల్పించామని చెప్పారు. ప్రస్తుతం ఆ ఆదాయంతోనే సంఘం సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నామని వివరించారు.
పీఏసీఎస్‌లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రాజకీయ కక్షతో చేస్తున్నవేనని హరికృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా విచారణను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే విచారణ పూర్తి చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే సంఘం సీఈవో మల్లారెడ్డి విచారణ అధికారులకు పూర్తిగా సహకరించడం లేదని ఆరోపించారు.
దళిత–రెడ్డి వివాదాన్ని కావాలనే సృష్టిస్తున్నారు
గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా లేని దళిత–రెడ్డి వివాదాన్ని ఇప్పుడు కావాలనే తెరపైకి తెచ్చి సామాజిక ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని హరికృష్ణ ఆరోపించారు. 2005లో కోనాపూర్ నుంచి తాండాకు వెళ్లే మార్గంలోని గుట్ట ప్రాంతంలో సుమారు 20 మంది దళితులకు ఒక్కొక్కరికి ఒక ఎకరం చొప్పున భూములు కేటాయించారని గుర్తు చేశారు.
దళితుల హక్కుల గురించి మాట్లాడుతున్న సాగర్ ఫారెస్ట్ భూమి, ఇరిగేషన్ శాఖకు చెందిన కుంట స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూమిలేని దళితులకు కూడా భూములు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఉపసర్పంచ్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ, ఒకే రికార్డుపై ఇద్దరు విచారణ అధికారులు రూ.2.26 కోట్లు, రూ.1.60 కోట్లుగా వేర్వేరు నివేదికలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇందులో ఏది వాస్తవమో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సీఈవో కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌లో సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఈ మీడియా సమావేశంలో సంజీవరెడ్డి, కడారి బీరయ్య, వెంకటరాజు రెడ్డి, సుశీల్ కుమార్, రవి నాయక్, నక్క సామెల్, హరికిషన్, మైపాల్ రెడ్డి, ఇమ్మానియేల్, కిష్టారెడ్డి, రాంరెడ్డి, రవికాంత్, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి