యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. జాతీయ రహదారిపై ధర్నా
మనోహరాబాద్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో యూరియా అందకపోవడంతో రైతులు గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పంటలకు యూరియా వేసే సమయం రావడంతో ఇప్పటికే యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం యూరియా బుకింగ్ కోసం యాప్‌ను తీసుకువచ్చినప్పటికీ అది సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొందరు రైతులకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడం పూర్తిస్థాయిలో అర్థం కాకపోగా, మరికొందరు బుక్ చేసుకున్నప్పటికీ యూరియా పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.
యూరియా కోసం పలుమార్లు ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు వెళ్లినా యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకే యూరియా ఇస్తామని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం యాప్‌లో సాంకేతిక సమస్య కారణంగా రైతులకు అందకపోవడం సరికాదని అన్నారు. యాప్ అవసరం లేకుండానే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ రైతు ఆగ్రోస్ వద్ద ఆందోళనకు దిగారు.
అనంతరం రైతులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మనోహరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు వ్యవసాయ అధికారులు యూరియా యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి స్రవంతి మాట్లాడుతూ.. యూరియా యాప్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని తెలిపారు. రైతు ఆగ్రోస్‌లో ఇప్పటికే 400 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, మరో లోడ్ కూడా రానుందని చెప్పారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ యాప్‌లో సమస్య కారణంగానే పంపిణీకి ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి యాప్ సమస్యను పరిష్కరించి యూరియాను సకాలంలో అందించాలని రైతులు కోరారు.
తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్ | తెలుగు ట్రెండ్స్



కామెంట్‌ను పోస్ట్ చేయండి