🌧️ చిన్నపాటి వర్షాలకే విద్యుత్ అంతరాయం.. అధికారుల తీరుపై సర్పంచుల ఆగ్రహం
పాపన్నపేట మండల సమీక్ష సమావేశం వాడివేడిగా.. సమస్యలపై ప్రశ్నల వర్షం
పాపన్నపేట , ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం వాడివేడిగా సాగింది. మెదక్ డీపీఓ యాదయ్య, ఎంపీడీఓ విష్ణువర్ధన్ సమక్షంలో జరిగిన సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు శాఖల అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా విద్యుత్ శాఖ ఏఈ, లైన్‌మెన్‌లు గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదని, చిన్నపాటి వర్షం పడితే చాలు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని సర్పంచులు మండిపడ్డారు. సమస్యపై ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదని ఆరోపించారు. చిన్న గ్రామాలకు సైతం లక్షల రూపాయల్లో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, వాటిని ఎలా చెల్లించాలంటూ ప్రశ్నించారు.
కుర్తివాడ గ్రామంలోని ఐదు వార్డులకు మిషన్ భగీరథ నీరు అందడం లేదని సర్పంచ్ చెట్టుకింది శ్రీధర్ తెలిపారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాపన్నపేట, రామతీర్థం గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నూతన ట్యాంకులు నిర్మించి పైపులైన్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని సర్పంచులు పావని నరేందర్ గౌడ్, సాయిరెడ్డి కోరారు.
మండలంలో 699 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 173 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏడుపాయల కమాన్, యూసుఫ్‌పేట, కొత్తపల్లి బ్రిడ్జి, ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సర్పంచులు పేర్కొన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ అధికారి తెలిపారు.
దాలాపూర్ గ్రామంలో పలువురు రైతులకు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్కులు లేక యూరియా పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు తెలిపారు. సంబంధిత భూములకు కోర్టు కేసులు ఉండటంతో సమస్య ఏర్పడిందని అధికారి వివరించారు.
మండలంలో మొత్తం 26,456 ఎకరాల సాగు భూమి ఉండగా.. 26,212 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ఏఓ పి. శ్రీనివాస్ రాజు తెలిపారు. మిగిలిన భూముల్లో పత్తి, కంది, పెసర, చెరకు, కూరగాయలు సాగు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏడుపాయల కమాన్ నుంచి ఏడుపాయల వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల రహదారులకు కూడా నిధులు కేటాయించినట్లు చెప్పారు. హమ్ గ్రాండ్ పథకం కింద కూడా పలు గ్రామాల్లో రహదారులు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
రామతీర్థంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు లేక మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ సాయిరెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు తెలిపారు. అలాగే గ్రామాల్లో పలువురికి జాబ్ కార్డులు లేవని సర్పంచులు ఇన్‌చార్జి ఏపీఓ యాదగిరి దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ అధికారులను మినహాయించి మిగతా శాఖల అధికారులు సమావేశానికి పూర్తిస్థాయిలో హాజరయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి