కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ రద్దు కుట్రను అడ్డుకోవాలి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాణిక్‌రావు తీవ్ర ఆగ్రహం

 


కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసే కుట్రను అడ్డుకోవాలి

ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాల మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ పథకాల ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల విషయంలో హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాణిక్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, వాటిని రద్దు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ పాండుకు సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌ నియోజకవర్గాలకు సంబంధించిన వినతిపత్రాలను బీఆర్‌ఎస్‌ నాయకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుండప్ప, జహీరాబాద్‌ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, కోహిర్‌ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రేండ్స్ జహీరాబాద్ రిపోర్ట్: నరసింహ

0/Post a Comment/Comments

ads

ads