పంచాయతీ కార్మికుల ఆందోళన.. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి

 


మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి.. పంచాయతీ కార్మికుల ఆందోళన

మనోహరాబాద్, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల జిల్లాలో 40 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నైపుణ్యానికి సంబంధం లేని వివిధ రకాల పనులు చేయించడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలని, రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 51ను సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, దహన సంస్కారాల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆసిఫ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్వామి, అంజయ్య, దుర్గయ్య, సత్యనారాయణ, బలమని, శోభ, సత్తమ్మ, దేవమ్మ, ఇందిర, సులోచన తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్
తెలుగు ట్రెండ్స్ – మనోహరాబాద్

0/Post a Comment/Comments

ads

ads