మెదక్ ఖిల్లాకు మహర్దశ.. ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఖిల్లాపై ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

 


ప్రముఖ పర్యాటక కేంద్రంగా మెదక్ ఖిల్లా

ఖిల్లాపై ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరణ

మెదక్, ఆగస్టు 17: చారిత్రక ప్రాధాన్యత కలిగిన మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తాయని రాష్ట్ర పర్యాటక, బొగ్గు గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని చారిత్రక మెదక్ ఖిల్లాపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంప్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు జిల్లా అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మెదక్ ఖిల్లాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. పురాతన కాలంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడం పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ విడుదల చేయడం అభినందనీయమని, ఇందుకు భారత తపాలా శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు కింద ఖిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులు తీసుకురావడంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. మెదక్ జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక రంగంలో జిల్లాకు మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మెదక్ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని మంత్రి విమర్శించారు. మెదక్‌ను పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్ చర్చి అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

మెదక్ ప్రాచీన చరిత్రను గుర్తు చేసిన ఎంపీ

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మెదక్ ఖిల్లా ప్రాచుర్యాన్ని గుర్తించి భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్, కవర్‌ను విడుదల చేయడం సంతోషకరమన్నారు. స్టాంప్ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

పురాతన కట్టడంగా పేరొందిన మెదక్ ఖిల్లాను స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రాచీన కాలం నాటి కోటల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు.

కాకతీయుల కాలంలో మెదక్ ప్రాంతాన్ని ‘మెతుకు సీమ’గా పిలిచేవారని రఘునందన్ రావు తెలిపారు. మంజీరా పరివాహక ప్రాంతంలో పండిన వరి ధాన్యంతో కాకతీయ రాజులకు అన్నం పెట్టిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి మెతుకు సీమ అనే పేరు వచ్చిందన్నారు.

అనేక రాజకీయ కారణాలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మెదక్ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన అన్నారు. ఒక దశలో మెదక్‌ను ప్రత్యేక జిల్లాగా సాధించుకునేందుకు ప్రజలు నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. చివరకు ప్రజల పోరాటం ఫలితంగా మెదక్ జిల్లా సాధించుకోవడం జరిగిందన్నారు.

మెదక్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే జిల్లాకు పర్యాటకంగా మరింత గుర్తింపు లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, పోస్టల్ శాఖ అధికారులు, మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రేండ్స్ మెదక్ రిపోర్ట్

0/Post a Comment/Comments

ads

ads