వెల్దుర్తిలో తల్లి, మూడేళ్ల కుమారుడు అదృశ్యంవెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు నమోదు

 



కుమారుడిని తీసుకుని వెళ్లిన తల్లి.. కనిపించకుండా పోయింది

వెల్దుర్తి మండలం, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్):
వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో తల్లి, ఆమె మూడేళ్ల కుమారుడు అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెల్దుర్తి ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకరంపేట మండలం దర్పల్లి గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి కుమార్తె చాకలి అనుషా (25)కు ఐదేళ్ల క్రితం చాకలి అనిల్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయస్సు నాలుగేళ్లు కాగా, చిన్న కుమారుడి వయస్సు మూడేళ్లు.

కుటుంబ కలహాల కారణంగా గత ఏడాది నుంచి అనుషా తన మూడేళ్ల చిన్న కుమారుడితో కలిసి దర్పల్లి గ్రామంలోని తన తల్లి చాకలి లక్ష్మి వద్ద ఉంటోంది. భోనాల పండుగ సందర్భంగా ఈ నెల 8న ఉప్పులింగాపూర్‌లోని తన పిన్ని చాకలి యాదమ్మ ఇంటికి అనుషా తన చిన్న కుమారుడితో కలిసి వెళ్లింది.

ఈ నెల 10న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అనుషా తన మూడేళ్ల కుమారుడిని తీసుకుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమె వెల్దుర్తి బస్టాండ్ వద్ద మెదక్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ అనుషా, ఆమె కుమారుడి ఆచూకీ లభించలేదు. దీంతో అనుషా తల్లి చాకలి లక్ష్మి వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుషా, ఆమె మూడేళ్ల కుమారుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి కోరారు.

0/Post a Comment/Comments

ads

ads