గుంతల రోడ్డుతో ప్రజల గోస.. పట్టించుకోని పాలకులు
మృత్యుమార్గంగా మారిన రహదారి.. పార్టీలకు అతీతంగా గ్రామస్తుల ధర్నా
మిరుదొడ్డి, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
ప్రభుత్వాలు మారుతున్నా.. నాయకులు మారుతున్నా.. తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు అధ్వానంగా మారి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామం నుంచి దుబ్బాక మండలం హబ్సిపూర్ ప్రధాన రహదారి వరకు ఉన్న రోడ్డు కొంతకాలంగా పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు తెలిపారు.
రోడ్డు పరిస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో కాసులాబాద్, హబ్సిపూర్ గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏకమై హబ్సిపూర్ వద్ద సిద్దిపేట–రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. ఓట్లు అడిగే సమయంలో గ్రామాలు, ప్రజలు గుర్తుకొస్తారని, కానీ ఏళ్ల తరబడి మృత్యుమార్గంగా మారిన ఈ రహదారి మాత్రం పాలకులకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు అధ్వాన పరిస్థితి కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు అవసరమైతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి