పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి
మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి వినతిపత్రం
కొల్చారం, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి కె. నర్సమ్మ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ తదితర కీలక పనులను ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల కార్మికులపై పనిభారం పెరిగిందని, నైపుణ్యానికి సంబంధం లేని అనేక రకాల పనులు చేయాల్సి వస్తోందని అన్నారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలో 800 మందికి పైగా కార్మికులు మృతి చెందారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, పంచాయతీ కార్మికులను రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, జీవో నంబర్ 51ను సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
అదేవిధంగా కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అవసరమైన సౌకర్యాలు అందించాలని, కార్మికుల మృతిచెందిన సందర్భంలో దహన సంస్కారాల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వెంటనే పరిష్కరించాలని నర్సమ్మ కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ మండల నాయకులు మల్లేశం, రవి, ప్రశాంత్, సత్యం, మల్లేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ – కొల్చారం


కామెంట్‌ను పోస్ట్ చేయండి