హరీష్ రావుకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
తెలుగు ట్రెండ్స్ తుప్రాన్ ఆగస్టు 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మాజీ మంత్రి హరీష్ రావుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని గజ్వేల్ ని
యోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, చేతబడుల వంటి అంశాలను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని సూచించారు.
మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15న సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాల గురించి మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రాలు, తంత్రాలు లేవని, అవన్నీ మూఢనమ్మకాలేనని పోలీసు శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సరికాదన్నారు. శాస్త్రీయ ఆలోచనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు.
వర్షాల విషయంలో గతంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, వర్షాధారిత పంటల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. అదే సమయంలో వర్షాలు పడకుండా హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
హరీష్ రావుపై క్షుద్ర పూజల పేరుతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు అవసరమైనది క్షుద్ర పూజల కథలు కాదని, గోదావరి జలాలను సద్వినియోగం చేసి రైతులకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని అన్నారు.
రైతు సమస్యలపై దృష్టి పెట్టాలి
రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. యూరియా కోసం యాప్‌లలో బుకింగ్ విధానం రైతులను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా బుకింగ్‌కు సంబంధించి యాప్‌లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గతంలో మాదిరిగా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ అంశాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ రైతులకు భరోసా కల్పించాలని కోరారు.
రేషన్ కార్డులపై విమర్శలు
రేషన్ కార్డుల విషయంలోనూ ముఖ్యమంత్రి వాస్తవాలను ప్రజలకు వివరించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు మంజూరు చేశారని పేర్కొన్నారు.
కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఉచిత బియ్యం అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా క్షేత్రంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎండగట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ గౌడ్, మాజీ సర్పంచ్ విట్టల్ యాదవ్, అర్జున్, పాలాట గ్రామ సర్పంచ్ సాయి గౌడ్, మాజీ సర్పంచ్ బిక్షపతి, ఉదయ్ రంజన్ గౌడ్, స్వామి రెడ్డి, రమేష్, శ్రీధర్, శేఖర్, నరేష్, పెద్దులు యాదవ్, మొద్దు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ R చంద్రశేఖర్


కామెంట్‌ను పోస్ట్ చేయండి