పెండింగ్ వేతనాల కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ వినతి

 

7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే

చెల్లించాలి: సీఐటీయూ డిమాండ్

మెదక్, ఆగస్టు 1 (తెలుగు ట్రెండ్స్): మిషన్ భగీరథలో గత పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు గత 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కడారి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెం.11 ప్రకారం చెల్లించాల్సిన వేతనాలకు బదులుగా రూ.8,350 మాత్రమే చెల్లిస్తున్నారని, అదీ గత 7 నెలలుగా బకాయిగా ఉండడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాల కోసం పలుమార్లు భూరత్న యాజమాన్యాన్ని సంప్రదించినప్పటికీ, "ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు" అనే సమాధానంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంస్థలో సుమారు 160 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.

మెదక్ జిల్లాలోని నర్సాపూర్, శివంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర, జిన్నారం, గుమ్మడిదల మండలాలకు చెందిన సుమారు 480 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అందించడంలో లైన్‌మెన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు:

  • 7 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి.
  • ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.
  • రైన్‌కోట్, టార్చ్‌లైట్, సేఫ్టీ షూస్ వంటి భద్రతా పరికరాలు అందించాలి.
  • కార్మికులందరికీ ఐడీ కార్డులు జారీ చేయాలి.
  • సూపర్వైజర్ల వేధింపులను అరికట్టాలి.
  • కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలి.
  • ఉద్యోగ భద్రత కల్పించాలి.

ఈ కార్యక్రమంలో కార్మికులు భాస్కర్, కుమార్, నర్సింలు, అశోక్, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads