పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం
మెదక్, ఆగస్టు 17 (తెలుగు ట్రెండ్స్): పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భ గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో రూ.3.25 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భవనాన్ని, చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన కేజీబీవీ భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం కేజీబీవీ విద్యార్థినులతో మంత్రి సమావేశమై పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాలికల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థినులకు ఇంకా ఏవైనా సౌకర్యాలు అవసరమైతే వాటిని మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. పేదల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తూ, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేజీబీవీల్లో అవసరమైన వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జిల్లాతో పాటు తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ కేజీబీవీల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశంపై ఏపీసీలు, కోఆర్డినేటర్లు, డీఈఓ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కేజీబీవీ సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్
మెదక్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్



కామెంట్‌ను పోస్ట్ చేయండి