🚌 యాదాద్రికి నేరుగా బస్సు.. భక్తుల్లో ఆనందం!
వెల్దుర్తి మండలం, ఆగస్టు 17 (తెలుగు ట్రెండ్సవెల్దుర్తి ): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్టకు నేరుగా వెళ్లే నూతన బస్సు సర్వీసును సోమవారం ప్రారంభించారు.
నర్సాపూర్ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరే ఈ బస్సు మంగళపర్తి, కుకునూరు, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకునేలా సర్వీసును ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల నుంచి యాదాద్రి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
యాదగిరి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు మణికొండ రాఘవేంద్రరావు విజ్ఞప్తి మేరకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మణికొండ రాఘవేంద్రరావు తదితరులు కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సును ప్రారంభించారు.
మణికొండ రాఘవేంద్రరావు స్వయంగా టికెట్ బుక్ చేసుకుని బస్సులో వెల్దుర్తి వరకు ప్రయాణించారు. మార్గమధ్యంలో జలాల్‌పూర్ శివారులోని కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సును సాగనంపారు. అనంతరం కుకునూరు గ్రామంలో బాజా భజంత్రీలతో ప్రజలు బస్సుకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, మంగళహారతులతో స్వాగతం పలికారు.
వెల్దుర్తికి చేరుకున్న అనంతరం బస్సు యాదగిరిగుట్ట వైపు ప్రయాణికులతో నిండుగా బయలుదేరింది. నూతన బస్సు సర్వీసుతో స్థానిక గ్రామాల ప్రజలు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై యాదాద్రి దర్శనానికి వెళ్లేందుకు ఇతర ప్రాంతాల్లో బస్సులు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించే అవకాశం లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంగళపర్తి సర్పంచ్ సంధ్య, రామకృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మహేష్‌రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి సర్పంచ్ దండం ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించిన టీజీఎస్‌ఆర్టీసీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ట్రెండ్స్ – వెల్దుర్తి రిపోర్టర్ నర్సింలు గౌడ్



కామెంట్‌ను పోస్ట్ చేయండి