అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్ యాత్ర
రామాయంపేట, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్): కల్లుగీత కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత, వృత్తి ఆధునీకరణే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘గీతన్నల చైతన్య యాత్ర’కు రామాయంపేటలో అపూర్వ స్పందన లభించింది. కేజీకేఎస్ (KGKS) ఆధ్వర్యంలో మానుకోట నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు చేపట్టిన బస్సు యాత్రకు మద్దతుగా బుధవారం రామాయంపేటలోని స్థానిక రేణుక మాత ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సమరసత సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. రామాయంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు కన్నపురం కృష్ణ గౌడ్‌తో పాటు గౌడ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల గీత కార్మిక కుటుంబాలు ప్రకృతి ప్రసాదించిన తాటి, ఈత చెట్లపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గీత వృత్తిలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలని, గీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కామ్రేడ్ ధర్మభిక్షం, ఎస్.ఆర్. దాట్ల వంటి త్యాగధనుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాన డిమాండ్లు
ఎన్నికల హామీలు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెన్షన్, ఎక్స్‌గ్రేషియా: గీత కార్మికుల పెన్షన్‌ను రూ.4,000కు, ప్రమాద ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా ఈ పరిహారం వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వయోపరిమితి పెన్షన్: జీవో ప్రకారం 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికులందరికీ వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బకాయిల విడుదల: పెండింగ్‌లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా నిధులను వెంటనే బాధిత కుటుంబాలకు చెల్లించాలని కోరారు.
వృక్ష సంరక్షణ: రాష్ట్రంలోని తాటి, ఈత చెట్లను గుర్తించి నంబర్లు కేటాయించి సంరక్షించాలని, చెట్లను నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ముగియనున్న గీతన్నల చైతన్య మహోద్యమ యాత్రను గీత కార్మికులందరూ ఏకమై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గీత కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి