ఆటో బ్యాటరీ చోరీ కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు

 


Telugu Trends

ఆటో బ్యాటరీ చోరీ కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు

నలుగురు నిందితుల అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం

పాత నేరాల్లోనూ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల వెల్లడి

అందోలు, ఆగస్టు 07 (Telugu Trends):

సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆటో బ్యాటరీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన ఆటో బ్యాటరీతో పాటు నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ తెలిపారు.

గురువారం జోగిపేట సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ రాత్రి అందోల్ మండలం దాకూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ పశువుల షెడ్ ప్రహరీ గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు అక్కడ పార్క్ చేసి ఉన్న ఆటోను దొంగిలించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆటోను తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో అందులోని సుమారు రూ.5 వేల విలువైన బ్యాటరీని చోరీ చేసి పరారైనట్లు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, గురువారం తెల్లవారుజామున వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆటోను తనిఖీ చేశారు. ఆటో నంబర్ ప్లేట్లపై బురద పూసి గుర్తుపట్టకుండా చేసినట్లు గుర్తించి అందులో ఉన్న నలుగురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ వెల్లడించారు.

అరెస్టు చేసిన నిందితులు మహమ్మద్ గౌస్ పాషా (అంబర్‌పేట్, హైదరాబాద్), మహమ్మద్ షఫీ అహ్మద్ (ఫలక్‌నుమా, హైదరాబాద్), మహమ్మద్ జమీలుద్దీన్ (రంజోల్, జహీరాబాద్ మండలం), బాగ్లీ మైనొద్దీన్ (భూత్‌కూర్, వట్‌పల్లి మండలం)గా పోలీసులు గుర్తించారు.

నిందితుల వద్ద నుంచి రూ.5 వేల విలువైన ఆటో బ్యాటరీ, ఒక ఇనుప రాడ్డు, ఒక స్క్రూడ్రైవర్, నేరానికి ఉపయోగించిన ఆటో, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో ప్రధాన నిందితులు పలువురు గతంలోనూ పలు ఆస్తి నేరాల్లో పాల్గొన్నట్లు వెల్లడైందని, హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వీరిపై పలు కేసులు నమోదై ఉన్నట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

ఈ కేసు ఛేదనలో ఎస్‌ఐ గిరి శ్రీకాంత్, పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు సీఐ అభినందించారు.

0/Post a Comment/Comments

ads

ads