పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనతో నర్సాపూర్ చౌరస్తాలో ఉద్రిక్తత
నర్సాపూర్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్): పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనతో నర్సాపూర్ చౌరస్తాలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శివంపేట్ మండలం గోమారం గ్రామ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు నర్సాపూర్ చౌరస్తాకు చేరుకుని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
కళాశాలలో నూతనంగా అమలు చేస్తున్న ‘శ్రీ శక్తి’ విధానాన్ని వెంటనే తొలగించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు చౌరస్తాలో మానవహారం చేపట్టడంతో నాలుగు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యార్థులను రోడ్డుపై నుంచి పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు ఆందోళన విరమించేందుకు నిరాకరించడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో చౌరస్తాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు తమ సమస్యలను వివరిస్తూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలుగు ట్రెండ్స్
నర్సాపూర్ రిపోర్టర్: శ్రీనివాస్



కామెంట్‌ను పోస్ట్ చేయండి