రాయి కొట్టడమే మా జీవనాధారం.. దానినీ అడ్డుకుంటే మా బతుకులు ఎలా..?

 

రాయి కొట్టడమే మా జీవనాధారం.. దానినీ అడ్డుకుంటే మా బతుకులు ఎలా..?

వడ్డెరల సంప్రదాయ వృత్తికి అనుమతులు కల్పించాలి
ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలి – మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గా సాయిలు

కొల్చారం, ఆగస్టు 8 (అక్షర కలం):
వడ్డెరల సంప్రదాయ వృత్తి అయిన రాళ్లు కొట్టే పనికి ప్రభుత్వం చట్టబద్ధమైన అనుమతులు కల్పించి, తమ జీవనోపాధిని కాపాడాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గా సాయిలు కోరారు. కొల్చారం మండలం పోతంచెట్టిపల్లి చౌరస్తాలోని హనుమమ్మ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన వడ్డెర ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా దుర్గా సాయిలు మాట్లాడుతూ వడ్డెరల జీవనం రాళ్లతో ముడిపడి ఉందన్నారు. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి నేటి వరకు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాళ్లు కొట్టే వృత్తిపై ఆంక్షలు, అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మా బతుకు రాయిపైనే ఆధారపడి ఉంది. రాయి కొట్టడమే మా జీవనోపాధి. ఆ వృత్తిని కూడా అడ్డుకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి?” అని ఆయన ప్రశ్నించారు.

మెదక్ జిల్లాలో అనేక వడ్డెర కుటుంబాలకు కనీసం గుంట భూమి కూడా లేదని, చాలామందికి సొంత ఇళ్లు లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రతి మండలంలో అటవీశాఖ అధికారులు రాళ్లు కొట్టే తమ సంప్రదాయ వృత్తిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉపాధి కోల్పోవడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

అడవుల్లోని అనుమతించదగిన బండలపై రాయి కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి

వడ్డెరల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి, పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు లోబడి అడవుల్లోని అనుమతించదగిన బండలపై రాళ్లు కొట్టుకునేందుకు చట్టబద్ధమైన అనుమతులు కల్పించాలని దుర్గా సాయిలు కోరారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో వడ్డెరలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

వడ్డెర కుటుంబాలకు భూమి, గృహాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సంప్రదాయ వృత్తిని కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. తమ జీవనాధారమైన రాయి కొట్టే వృత్తిని దూరం చేస్తే వడ్డెర కుటుంబాల జీవనం మరింత దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం వడ్డెర సమాజాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా జరుపటి జైపాల్‌ను, తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా గుంజ రేణుకను నియమించడంపై వడ్డెర సమాజం తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో కొల్చారం మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు ఓర్స ఈశ్వర్, దారంగుల ఎల్లయ్య, ఎత్తరి పెంటయ్య, వల్లపు శ్రీనివాస్, సంపంగి రమేష్, జరుపటి రాజు, హనుమంతు, వెంకటేశం, యాదగిరి, నిఖిల్, రమేష్, ఎల్లేష్, కుమార్, నాగయ్య, శివరాములు, పోచయ్య, నాగరాజ్, వీరేశం తదితర వడ్డెర నాయకులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads