వరికి బదులుగా ఆయిల్‌పామ్, ఆరుతడి పంటల వైపు రైతులు మళ్లాలి
మనోహరాబాద్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్):
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తూప్రాన్ ఆర్డీవో బావయ్య సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్‌పామ్, ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.
మంగళవారం మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో రైతు మల్లారెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ పంటను మండల వ్యవసాయ అధికారి స్రవంతితో కలిసి ఆర్డీవో బావయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ సాగు విధానం, పెట్టుబడి, దిగుబడి తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉన్న ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వరి పంటకు అధికంగా నీరు అవసరమవుతుందని, వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి స్రవంతి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. వరికి బదులుగా పప్పు దినుసులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, స్వీట్ కార్న్, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.
అలాగే తక్కువ నీటితో సాగు చేసే ఆకుకూరలు, కూరగాయల పంటలను కూడా రైతులు సాగు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్, ఏఈఓ నరేందర్ గౌడ్తో పాటు రైతులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ రిపోర్టర్
ఆర్. చంద్రశేఖర్


కామెంట్‌ను పోస్ట్ చేయండి