క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
సీఐటీయూ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ
కొల్చారం, ఆగస్టు 8 (అక్షర కలం):
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ పిలుపునిచ్చారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రచార యాత్ర సందర్భంగా కొల్చారం మండల కేంద్రంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేసిందని విమర్శించారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికుల పనిగంటలు పెరగడంతో పాటు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులపై పని భారం పెంచే ఈ నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా చట్టాల వల్ల ప్రజలకు ఉచిత విద్యుత్ దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2005లో యూపీఏ-కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వామపక్షాల పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు రాష్ట్రాల వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలోని 100 రోజుల పనిని ఎత్తివేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 10న సోమవారం నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున నర్సమ్మ కోరారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డీ. మల్లేశం, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శేఖర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి