తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం పోరుబాట.. ఎనిమిదో రోజుకు రిలే దీక్షలు
వెల్దుర్తి మండలం, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు మండలంలోని ఆరెగూడెం, చర్లపల్లి, ఎలుకపల్లి, చేర్యాల గ్రామాలతో పాటు వివిధ వర్గాల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇందులో భాగంగా వెల్దుర్తి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు దీక్షా శిబిరంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న ఉద్యమం క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటికే విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూడు సార్లు బంద్ నిర్వహించినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల ఏర్పాటుకు సంబంధించి అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులకు వివరాలు అందజేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని నాయకులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు, నివేదికలు అందజేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. అవసరమైతే విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల బంద్‌కు పిలుపునిస్తామని తెలిపారు. అలాగే వెల్దుర్తిలో వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించి నిరసనను మరింత బలంగా తెలియజేస్తామని ప్రకటించారు.
మండల ప్రజల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు.
వెల్దుర్తి రిపోర్టర్: నరసింహా గౌడ్ | తెలుగు ట్రెండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి