గద్దర్ ఆశయాలు భావితరాలకు దిక్సూచి: డా. గుమ్మడి వెన్నెల
మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి – పాఠ్యపుస్తకాల్లో జీవిత చరిత్ర చేర్చాలని డిమాండ్
మెదక్, ఆగస్టు 7:
ప్రజాకవి గద్దర్ ఆశయాలు నేటి యువతకు దిక్సూచిగా నిలవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల అన్నారు. గద్దర్ మూడవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న గద్దర్ విగ్రహ స్థలంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శివ్వన్నగారి నరసింహచారి, ప్రధాన కార్యదర్శి బచ్చు సంగమేశ్వర్‌లను డాక్టర్ గుమ్మడి వెన్నెల శాలువాలతో సన్మానించి అభినందించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు గద్దర్ అని కొనియాడారు. తన ఆట, పాటలతో దోపిడీ వ్యవస్థను ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజా యుద్ధనౌకగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఉద్యమానికి ఊపిరి పోశాయని అన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం గద్దర్ చూపిన మార్గాన్ని భావితరాలు కొనసాగించాలని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, ఆయన జన్మించిన మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ప్రెస్ క్లబ్ కోశాధికారి చెవిటి అశోక్, సీనియర్ జర్నలిస్టులు బాలేశ్వర్‌రావు, శంకర్ దయాళ్ చారి, బొందుగుల నాగరాజు, ఫారుక్ హుస్సేన్, చింతల రమేష్, నర్సింలు, చల్ల రాహుల్, దౌలయ్య, సిద్ధేశం, లక్ష్మణ్, శ్రీహరి, కృష్ణమూర్తి, కార్తీక్, శ్రీకాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు గంట సంపత్, జుబేర్, అస్తరు గల్లా బాల్‌రాజు, మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల మైసయ్య, ఆకుల పెంటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, బీఎస్పీ నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి