లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పద్మ దేవేందర్‌రెడ్డి అండ.. 6,500 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
రామాయంపేట, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భూ కొలతలు, హద్దుల నిర్ధారణ వంటి కీలక సేవలు అందిస్తున్న లైసెన్స్‌డ్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధనకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే వారి తరఫున ఉద్యమం చేపడతామని ఆమె స్పష్టం చేశారు.
సుమారు ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని పద్మ దేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారందరినీ విధుల్లోకి తీసుకుని నిరంతరంగా పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం అమలులో ఉన్న కమిషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ప్రతి లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు నెలకు కనీసం రూ.30 వేల గౌరవ వేతనం అందించేలా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అనారోగ్య సమస్యలు ఎదురైతే వారికి ఆర్థిక భరోసా కల్పించేలా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సర్వేయర్లకు టీఏ, డీఏలు చెల్లించాలని, ప్రతి లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు రెండు గ్రామాలను కేటాయించి నిరంతర పని కల్పించాలని సూచించారు. ఉద్యోగ భద్రతతో పాటు సర్వేయర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు
- కమిషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి.
- ప్రతి లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు నెలకు రూ.30 వేల కనీస గౌరవ వేతనం చెల్లించాలి.
- ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
- విధి నిర్వహణకు సంబంధించిన టీఏ, డీఏలు చెల్లించాలి.
- ప్రతి సర్వేయర్‌కు రెండు గ్రామాలను కేటాయించాలి.
- ఉద్యోగ భద్రత, నిరంతర పని కల్పించేలా ప్రత్యేక విధానం రూపొందించాలి.
- ఏడాది కాలంగా విధులకు దూరంగా ఉన్న 6,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్రజలకు, ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థకు కీలకమైన సేవలు అందిస్తున్నారని పద్మ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే వారితో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లైసెన్స్‌డ్ సర్వేయర్ల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. రిపోర్ట్ B యాదగిరి రామాయంపేట


కామెంట్‌ను పోస్ట్ చేయండి