అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వం లక్ష్యం
తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మెదక్, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరావేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మెదక్ జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 4.49 కోట్ల సార్లు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, గృహజ్యోతి కింద 1.29 లక్షల మందికి జీరో విద్యుత్ బిల్లులు జారీ చేశామని వివరించారు. రైతు భరోసా కింద 2,66,674 మంది రైతులకు రూ.222.69 కోట్లు అందించినట్లు తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 39,339 మంది పేదలు వైద్య సేవలు పొందగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 8,955 ఇళ్లు మంజూరు చేసి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో 2,41,393 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు.
విద్యా రంగంలో భాగంగా రెండు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరయ్యాయని, రామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. వనమహోత్సవంలో 31.95 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఏడుపాయల ఆలయంలో వసతి గృహాల ఏర్పాటుకు రూ.7 కోట్లు, మెదక్ ఫోర్ట్ పునరుద్ధరణకు రూ.57 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మెప్మా ఆధ్వర్యంలో రూ.3.5 కోట్ల విలువైన జంబో చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలు అందించి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ | రిపోర్టర్: వికాస్, మెదక్



కామెంట్‌ను పోస్ట్ చేయండి