బాలికను వేధించిన నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా

 

Ai ఫోటో 

బాలికను వేధించిన నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా

మెదక్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): బాలికను వేధిస్తూ అసభ్యకరమైన ఫొటోలు పంపాలని కోరడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. దాసరి స్వామి (26) అనే వ్యక్తి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఫోన్ నంబర్ ఇవ్వాలని తరచూ వేధించేవాడు. బాలిక స్నేహితుల వద్ద నుంచి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి, పాఠశాల వద్దకు వస్తానని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడు. బాలిక అతడిని కలవకుండా ఇంటికి వెళ్లడంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఇకపై బాలిక జోలికి రానని నిందితుడు రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు.

అయితే రెండేళ్ల తర్వాత వేసవి సెలవుల్లో మళ్లీ బాలికకు వాట్సాప్‌లో సందేశాలు పంపించాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికను అసభ్యకరమైన చిత్రాలు పంపాలని కోరుతూ వేధించాడు. 2024 మే 24న బాలిక తండ్రికి ఫోన్ చేసి తన కుమార్తెను ఇంటికి పంపాలని, లేకపోతే ఆమె మేజర్ అయిన తర్వాత లేపుకుపోతానంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మెదక్ జిల్లా శివంపేట మండలంలో అప్పటి ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. పోలీసుల సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్‌.ఎం. సుభావాలి నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

కేసు దర్యాప్తు, కోర్టు వ్యవహారాల్లో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కృష్ణగౌడ్, సీడీఓ ఆనంద్ సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించారు.

మెదక్ | తెలుగు ట్రెండ్స్

0/Post a Comment/Comments

ads

ads