రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్
లింగారెడ్డిపేట, బొమ్మారం రైల్వే ఆర్‌యూబీల తాత్కాలిక మూసివేత
రెండు నెలలపాటు మరమ్మతు పనులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని రైల్వే అధికారుల సూచన
తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్, ఆగస్టు 24:
తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట, మాసాయిపేట మండలం బొమ్మారం రైల్వే అండర్ రైల్వే బ్రిడ్జి (ఆర్‌యూబీ)లను మరమ్మతు పనుల కారణంగా తాత్కాలికంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కన్నపేట–మేడ్చల్ రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా విద్యుదీకరణ, సిగ్నలింగ్ తదితర పనులు చేపడుతున్నారు. మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్‌యూబీ ప్రస్తుతం సింగిల్ రైల్వే లైన్‌కు అనుగుణంగా ఉండగా.. రైల్వే లైన్‌ను డబుల్ లైన్‌గా విస్తరించే పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు.
ఈ నిర్మాణ, మరమ్మతు పనుల కారణంగా లింగారెడ్డిపేట, బొమ్మారం ఆర్‌యూబీలను సుమారు రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో వాహనదారులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
లింగారెడ్డిపేట, బొమ్మారం ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే చిన్న వాహనదారులు బొమ్మారం–నాగులపల్లి జాతీయ రహదారి మార్గాన్ని వినియోగించాలని అధికారులు సూచించారు. బస్సులు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు బొమ్మారం–కుప్పలపల్లి–దంతాలపల్లి–నాగులపల్లి జాతీయ రహదారి మార్గం ద్వారా రాకపోకలు సాగించాలని తెలిపారు.
మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
ఈ వివరాలను రైల్వే శాఖ అడ్మిన్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్ అధికారి సోమ సుందర్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్
రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్


కామెంట్‌ను పోస్ట్ చేయండి