స్పెల్ బీ జాతీయ స్థాయి పోటీల్లో శ్రీ విద్యా పాఠశాల విద్యార్థుల ప్రతిభ
జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి సాధించిన శ్రేష్టక్షర
పాపన్నపేట, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): స్పెల్ బీ జాతీయ స్థాయి పోటీల్లో పాపన్నపేట శ్రీ విద్యా పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు, పాపన్నపేట ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్పెల్ బీ పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున శ్రీ విద్యా పాఠశాలకు చెందిన ఈ. అక్షిత్, శ్రేష్టక్షర, మనోహర్ పాల్గొన్నారు.
గత సంవత్సరం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పెల్ బీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న జాతీయస్థాయి పోటీల్లో శ్రీ విద్యా పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీల్లో భాగంగా నిర్వహించిన మూడు రౌండ్లలో శ్రేష్టక్షర అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. అలాగే ఈ. అక్షిత్, మనోహర్ ఇద్దరూ రెండు రౌండ్లలో ప్రతిభ కనబరిచి తమ సత్తాను చాటారు. జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జాతీయస్థాయిలో తృతీయ బహుమతి సాధించిన శ్రేష్టక్షరతో పాటు పోటీల్లో పాల్గొన్న ఈ. అక్షిత్, మనోహర్‌లను పాఠశాల కరస్పాండెంట్లు నిటలాక్షప్ప, సుమన్, ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోందని తెలిపారు.
చిన్న వయసులోనే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతి సాధించడం పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో కూడా విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి