తూప్రాన్‌లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

 


రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్

పేద కుటుంబాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. తూప్రాన్‌లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్, ఆగస్టు 24:

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాంజాల కీర్తన విఠల్ రెడ్డి అన్నారు.

సోమవారం తూప్రాన్ మున్సిపల్ పరిధితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా మంజూరైన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను తూప్రాన్ మున్సిపల్ చైర్‌పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా యాంజాల కీర్తన విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన కుటుంబాలను గుర్తించి కొత్త రేషన్ కార్డులు అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డుల్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన కుటుంబాలకు ప్రస్తుతం ప్రయోజనం కలుగుతోందన్నారు.

డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కీర్తన విఠల్ రెడ్డి పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నందాల శ్రీనివాస్, కొడిపేక నారాయణ గుప్తా, నాగరాజు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మణ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, రేషన్ డీలర్లు, గ్రామాల ప్రజలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్
రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్

0/Post a Comment/Comments

ads

ads