రిపోర్టర్: R చంద్రశేఖర్
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించాలి.. మానవ హక్కుల కమిషన్, కాలుష్య నియంత్రణ మండలికి వినతి
రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలి: వంటేరు ప్రతాప్‌రెడ్డి
తెలుగు ట్రెండ్స్ – మనోహరాబాద్, ఆగస్టు 24:
రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల పరిధిలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై చర్యలు తీసుకుని, పరిశ్రమను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వినతిపత్రాలు అందజేశారు.
హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జి. రవి ఐఏఎస్‌ను, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అక్తర్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డి గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి కలిశారు. పరిశ్రమ కారణంగా ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయు, జల, శబ్ద కాలుష్యం వల్ల రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో వివరించినట్లు చెప్పారు.
పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్య నీరు చెరువులు, కుంటల్లోకి చేరడంతో నీటి వనరులు కలుషితమవుతున్నాయని, చేపలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్న కారణంగా బోర్ల నీటిని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. కాలుష్య ప్రభావంతో పంటలు కూడా సరిగా పండడం లేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా పరిశ్రమ నుంచి వెలువడుతున్న పెద్ద శబ్దాల కారణంగా విద్యార్థులు చదువుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి విద్యాభ్యాసంపై ప్రభావం పడుతోందని ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, పశుసంపదపై కాలుష్య ప్రభావాన్ని అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
గ్రామాల ప్రజల సమస్యలను తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జి. రవి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ దృష్టికి తీసుకెళ్లామని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సమస్యపై స్పందించిన వారు మెదక్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.
రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు అధైర్యపడవద్దని, వారి తరఫున బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించే వరకు చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని ప్రజల సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.
“ఎంఎస్ అగర్వాల్ కంపెనీ హటావో.. రంగాయిపల్లి, చెట్ల గౌరారం ప్రజల ప్రాణాలను బచావో” అంటూ నినాదం చేశారు.
కార్యక్రమంలో మనోహరాబాద్ మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి