రాఖీతో సోదరభావం.. దేశభక్తి సందేశం “నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనం ఇద్దరం దేశానికి రక్ష” అంటూ విద్యార్థుల ప్రతిజ్ఞ

 



రాఖీతో సోదరభావం.. దేశభక్తి సందేశం

స్వయంగా రాఖీలు తయారు చేసి పరస్పరం కట్టుకున్న విద్యార్థులు

“నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనం ఇద్దరం దేశానికి రక్ష” అంటూ ప్రతిజ్ఞ

వెల్దుర్తి, ఆగస్టు 27 (నవ పలుకులు): రక్షాబంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో వినూత్నంగా రాఖీల తయారీ, రక్షాబంధన్‌ వేడుకలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యార్థులు రంగురంగుల దారాలు, పూసలు, వివిధ అలంకరణ వస్తువులను ఉపయోగించి తమకు నచ్చిన ఆకృతుల్లో రాఖీలను స్వయంగా తయారు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థినీ, విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తమ చేతులతో తయారు చేసిన రాఖీలను ఒకరికొకరు కట్టుకోవడంతో పాఠశాలలో సందడి నెలకొంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్షాబంధన్‌ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. రాఖీ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే ప్రతీక కాదని, పరస్పర గౌరవం, సహకారం, ఆపదలో ఒకరికొకరు అండగా నిలవడం, సోదరభావాన్ని పెంపొందించుకోవడానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

అనంతరం “నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనం ఇద్దరం దేశానికి రక్ష” అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమగ్రత, శాంతి, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య తెలిపారు. చదువుతో పాటు మానవీయ విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, అమూల్య, నవనీత, సునీత, జయసుధ, విజయ్‌మోహన్, రేణుక, కదీర్, ప్రశాంతి, రామూ, రాధిక తదితరులు పాల్గొన్నారు.

నవ పలుకులు – రిపోర్టర్‌: ఎన్‌. నర్సింహా గౌడ్‌, వెల్దుర్తి

0/Post a Comment/Comments

ads

ads