Type Here to Get Search Results !

రామాయంపేటలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

 


రిపోర్టర్: బి. యాదగిరి

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

ఇంజనీర్ల నిర్లక్ష్యమా.. అధికారుల అలసత్వమా? మూడు నెలలుగా సిద్దిపేట రోడ్డుపై ప్రజలకు తప్పని తిప్పలు

తెలుగు ట్రెండ్స్ – రామాయంపేట, ఆగస్టు 24:

రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్డుపై ప్రధాన డ్రైనేజీ సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రధాన రహదారిపై నెలకొన్న డ్రైనేజీ సమస్య మాత్రం మూడు నెలలుగా కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

గత మూడు నెలలుగా సిద్దిపేట రోడ్డు ప్రధాన రహదారి వద్ద డ్రైనేజీ కాలువ సమస్యతో వాహనదారులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు డ్రైనేజీ కాలువను తవ్వి పనులు చేపట్టినా.. వర్షం పడిన ప్రతిసారీ మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో రహదారిపై నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

మురుగునీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు సైతం మురుగునీటిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు తాత్కాలికంగా పనులు చేపడుతున్నప్పటికీ సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే గతంలోనే అధికారులను ఆదేశించినప్పటికీ.. పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. “తాత్కాలిక తవ్వకాలు.. శాశ్వత సమస్యలు” అన్నట్లుగా పరిస్థితి మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించి నిపుణులైన ఇంజనీర్లతో డ్రైనేజీ వ్యవస్థను సాంకేతికంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. మురుగునీటి ప్రవాహం, కాలువ సామర్థ్యం, రహదారి స్థాయి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

భారీ వర్షాలు కురిసే సమయంలో మురుగునీరు ఇళ్లలోకి చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

రిపోర్టర్: బి. యాదగిరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language