రిపోర్టర్: ముత్తయ్య
అవసరాల మేరకే యూరియా కొనుగోలు చేయాలి
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎరువుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ: ఏఓ శ్వేతకుమారి
తెలుగు ట్రెండ్స్ – కొల్చారం, ఆగస్టు 24:
రైతులు సంయమనం పాటించి తమ పంటలకు అవసరమైన మేరకే యూరియాను కొనుగోలు చేయాలని కొల్చారం మండల వ్యవసాయ అధికారి (ఏఓ) ఎం. శ్వేతకుమారి సూచించారు. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మండలంలో యూరియా సరఫరాను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఓ శ్వేతకుమారి మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీ నుంచి ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS) ఎరువుల బుకింగ్ యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. కొత్తగా ప్రారంభించిన యాప్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నందున కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
రైతులు తమ ప్రస్తుత పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని సూచించారు. అవసరానికి మించి పెద్ద మొత్తంలో ఎరువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల ఇతర రైతులకు ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
రబీ సీజన్ కోసం రైతులు ముందుగానే యూరియాను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
కొల్చారం మండలంలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందుబాటులో ఉండేలా ఎరువుల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఏఓ శ్వేతకుమారి పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారులకు సహకరించాలని కోరారు. అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయకుండా ఇతర రైతులకు కూడా అందుబాటులో ఉండేలా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్: ముత్తయ్య
తెలుగు ట్రెండ్స్ – కొల్చారం



కామెంట్‌ను పోస్ట్ చేయండి