ఎరువుల బుకింగ్‌కు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై రైతులకు అవగాహన 48 గంటల్లో ఎరువులు తీసుకోవాలి: వ్యవసాయాధికారి కవిత

 


మాసాయిపేటలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై రైతులకు అవగాహన

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌తో ఎరువుల బుకింగ్‌ సులభం.. 48 గంటల్లో ఎరువులు తీసుకోవాలి

మాసాయిపేట, ఆగస్టు 25 (నవ పలుకులు): మాసాయిపేట రైతు వేదికలో ఎరువుల బుకింగ్‌ విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెర్టిలైజర్‌ సెల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌ ద్వారా ఎరువులు బుక్‌ చేసుకునే విధానాన్ని రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా వ్యవసాయాధికారి కవిత మాట్లాడుతూ రైతులందరూ ముందుగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తికాని రైతులకు యాప్‌లో భూమి, సర్వే నంబర్‌ వివరాలు కనిపించవని తెలిపారు. అలాంటి రైతులు వెంటనే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా ప్రస్తుతం యూరియాతో పాటు డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ తదితర ఎరువులను కూడా బుక్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైతులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తెలుగు లేదా ఇంగ్లిష్‌ భాషను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఆధార్‌ నంబర్‌ లేదా ఫార్మర్‌ ఐడీతో లాగిన్‌ అయి, యాప్‌లో కనిపించే భూమి, సర్వే నంబర్‌ వివరాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసిన తర్వాత పంటకు అవసరమైన ఎరువుల పరిమాణాన్ని యాప్‌ సూచిస్తుందని కవిత వివరించారు. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువుల సంచులను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్‌ పూర్తయిన అనంతరం రైతులకు క్యూఆర్‌ కోడ్‌, బుకింగ్‌ ఐడీ వస్తాయని, వాటిని సంబంధిత ఎరువుల దుకాణంలో చూపిస్తే దుకాణదారులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఎరువులను అందజేస్తారని వివరించారు.

బుకింగ్‌ చేసిన రైతులు తప్పనిసరిగా 48 గంటల్లోపు ఎరువులను తీసుకోవాలని వ్యవసాయాధికారి సూచించారు. నిర్ణీత సమయంలో ఎరువులు తీసుకోకపోతే క్యూఆర్‌ కోడ్‌ గడువు ముగుస్తుందని, తిరిగి ఎరువులు పొందాలంటే మళ్లీ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఒకసారి ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల వ్యవధి పూర్తయిన అనంతరం మాత్రమే తిరిగి యాప్‌లో ఎరువులు బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇప్పటికే యూరియా తీసుకున్న రైతులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, అవసరానికి మించి ఎరువులను నిల్వ చేసుకోకుండా ఇతర రైతులకు కూడా ఎరువులు అందేలా సహకరించాలని కవిత కోరారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ వినియోగంలో రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

రిపోర్టర్: ఎన్. నర్సింహ గౌడ్
నవ పలుకులు – మాసాయిపేట

0/Post a Comment/Comments

ads

ads