మెదక్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు – 'గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా చిరువ్యాపారులకు గొడుగుల పంపిణీ
మెదక్, జూలై 25 (తెలుగు ట్రెండ్స్):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కేటీఆర్ పేరిట ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థించారు.
అనంతరం 'గిఫ్ట్ ఏ స్మైల్' సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని చిరువ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎం. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పట్టణాల రూపురేఖలు మార్చి ఆధునిక సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొంటూ, కేటీఆర్ జన్మదినాన్ని కేక్ కట్ చేయడం కంటే సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం బీఆర్ఎస్ ప్రత్యేకత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్, మెదక్


కామెంట్‌ను పోస్ట్ చేయండి