రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు
మెదక్, జూలై 24 (తెలుగు ట్రెండ్స్): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ ప్రార్థనా కార్యక్రమానికి మెదక్ బిషప్ కమిస్సరీ రేవ. జయనంద్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని దేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
మెదక్ డయాసిస్ పరిధిలోని మూడు జిల్లా చర్చి కౌన్సిళ్ల (డీసీసీ) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గోదావరి డీసీసీ పరిధిలోని నిజామాబాద్–లక్షెట్టిపేటలో గురువారం ప్రార్థనలు నిర్వహించగా, శుక్రవారం మెదక్ డీసీసీ పరిధిలో మెదక్‌లో నిర్వహించారు. శనివారం టౌన్ డీసీసీ పరిధిలో హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ లే సెక్రటరీ పెద్ది దేవసహాయ్, ప్రాపర్టీ కన్వీనర్ మంత్రి సొలొమోను, మెదక్ డీసీసీ చైర్మన్ జార్జి ఎబినేజర్, వైస్ చైర్మన్ దేవదాస్, డయాసిస్ గురువులు రేవ. గడ్డి ప్రేమ్‌కుమార్, మెదక్ ప్రెస్బిటర్ ఇన్చార్జి రేవ. శాంతయ్య, మెదక్ చర్చి సెక్రటరీ గెలన్ చిత్తరంజన్, గంట సంపత్, సుశీల్, నోబుల్సన్ తదితరులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్ డెస్క్


కామెంట్‌ను పోస్ట్ చేయండి