హైదరాబాద్ ట్రాఫిక్‌కు AI టెక్నాలజీ.. స్మార్ట్ సిగ్నల్స్ అమలు సీఎం రేవంత్


 హైదరాబాద్ ట్రాఫిక్‌కు AI టెక్నాలజీ.. స్మార్ట్ సిగ్నల్స్ అమలు సీఎం రేవంత్ 



అనలాగ్–మెగా ఇంజనీరింగ్ సంయుక్తంగా ఫిజికల్ ఇంటెలిజెన్స్ పైలట్ ప్రాజెక్టు.. ట్రాఫిక్, అత్యవసర సేవలకు నెక్స్ట్ జనరేషన్ పరిష్కారాలు




హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి ఆధునిక సాంకేతికతతో పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థతో అనుసంధానం చేసి, ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా సిగ్నల్స్ స్వయంచాలకంగా పనిచేసే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు.


ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనలాగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL) ఎండీ పి. కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.


ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఒకే వ్యవస్థలో అనుసంధానం చేసి, వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీ, అత్యవసర పరిస్థితులను గుర్తిస్తూ సిగ్నల్స్ స్వయంగా స్పందించేలా AI టెక్నాలజీని వినియోగించాలని సీఎం సూచించారు.


ఫిజికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ రద్దీని ముందుగానే గుర్తించడం,  పరిష్కరించడం, విద్యుత్ వినియోగాన్ని అవసరానికి అనుగుణంగా నియంత్రించడం, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలకు వేగంగా మార్గం కల్పించడం వంటి స్మార్ట్ సిటీ సేవలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని సంస్థ ప్రతినిధులు వివరించారు.


సమావేశంలో అనలాగ్ సంస్థ, మెగా ఇంజనీరింగ్ మధ్య ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU)పై ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణను నెక్స్ట్ జనరేషన్ కాగ్నిటివ్ సిటీల దిశగా ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

0/Post a Comment/Comments

ads

ads