రిపోర్టర్: తెలుగు ట్రెండ్స్
మెదక్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారడం ఖాయం: మహేష్‌కుమార్ గౌడ్
పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు ప్రాధాన్యత.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలుగు ట్రెండ్స్ – మెదక్, ఆగస్టు 24:
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, రానున్న రోజుల్లో మెదక్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఉమ్మడి మెదక్ పీఏసీ సమావేశం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షుడు పూజల హరికృష్ణ, మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల ఆవేదనను అధిష్ఠానం అర్థం చేసుకుంటుందని తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పాత, సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు.
మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు, ఆలయ కమిటీలు, లైబ్రరీలు తదితర పదవుల్లో పార్టీని నమ్ముకుని పనిచేసిన పాత నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 70 శాతానికి పైగా పదవులు పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులకే దక్కేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అర్హులైన పేదల ఓటు హక్కును కాపాడేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేశారని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఓటు హక్కుకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు సంబంధిత వివరాలు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని ఆయన విమర్శించారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ప్రశ్నిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మెరుగైన వైద్య సేవలు, వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రజా మద్దతు ఉందని మంత్రి అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
ప్రజలకు చేరువగా వైద్య సేవలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, అయితే పార్టీకి నష్టం కలిగించే విధంగా హద్దులు దాటి వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని మహేష్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



إرسال تعليق