ఆగస్టు 31 గడువు సమీపిస్తున్నా రేషన్ బియ్యం ఏదీ? పాపన్నపేట ఎఫ్‌సీఐ గోదాంలో డీలర్లకు తిప్పలు!



 

రిపోర్టర్: పి. శ్రీనివాస్

పాపన్నపేట ఎఫ్‌సీఐ గోదాంలో పీడీఎస్ బియ్యం పంపిణీపై రేషన్ డీలర్ల ఆందోళన

గడువు దగ్గరపడుతున్నా అందని బియ్యం.. బస్తాల్లో తూకం తక్కువగా వస్తోందని డీలర్ల ఆరోపణ

తెలుగు ట్రెండ్స్ – పాపన్నపేట, ఆగస్టు 25:

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోందని, గడువు సమీపిస్తున్నా తమ రేషన్ షాపులకు పూర్తిస్థాయిలో బియ్యం చేరడం లేదని పాపన్నపేట, టేక్మాల్ మండలాలకు చెందిన పలువురు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపన్నపేట మండల కేంద్రంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఎఫ్‌సీఐ గోదాం వద్ద బియ్యం పంపిణీ తీరుపై డీలర్లు పలు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని సకాలంలో అందించాలని ఆదేశించినట్లు డీలర్లు తెలిపారు. ఆగస్టు 31లోగా బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. గడువు సమీపిస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల రేషన్ షాపులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బియ్యం చేరలేదని పేర్కొన్నారు.

పాపన్నపేట ఎఫ్‌సీఐ గోదాం నుంచి పాపన్నపేట, టేక్మాల్ మండలాలకు చెందిన రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా అవుతోంది. అయితే బియ్యం సరఫరాలో తమకు నచ్చిన గ్రామాలకు చెందిన డీలర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కొందరు డీలర్లు గోదాం ఇన్‌చార్జిపై ఆరోపణలు చేశారు. అన్ని రేషన్ షాపులకు సమానంగా, క్రమపద్ధతిలో బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు.

డీలర్లపై కార్డుదారుల ఒత్తిడి

బియ్యం సకాలంలో రేషన్ షాపులకు చేరకపోవడంతో గ్రామాల్లో రేషన్ కార్డుదారుల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని డీలర్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా గోదాం నుంచి సరఫరా ఆలస్యం కావడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

మరోవైపు గోదాంకు లారీల ద్వారా వచ్చిన బియ్యం బస్తాలను తూకం వేసే విషయంలోనూ లోపాలు ఉన్నాయని కొందరు డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కిలోలు ఉండాల్సిన బియ్యం బస్తాల్లో ఒకటి నుంచి రెండు కిలోల వరకు తక్కువగా వస్తున్నాయని వారు చెబుతున్నారు. ప్రతి బస్తాను తూకం వేసి మాత్రమే తమకు అందజేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

బియ్యం తూకంపై అధికారుల దృష్టి సారించాలని డిమాండ్

రేషన్ బియ్యం పేదలకు నేరుగా చేరే ప్రభుత్వ సరుకని, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని డీలర్లు కోరుతున్నారు. గోదాంలోకి వచ్చే బియ్యం బస్తాలను, డీలర్లకు పంపిణీ చేసే సమయంలోనూ తూకం వేసి రికార్డులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

గడువు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాపన్నపేట ఎఫ్‌సీఐ గోదాం పరిస్థితిని పరిశీలించాలని డీలర్లు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బియ్యాన్ని వెంటనే అన్ని రేషన్ షాపులకు సరఫరా చేసి, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గోదాం ఇన్‌చార్జి వివరణ

ఈ ఆరోపణలపై పాపన్నపేట ఎఫ్‌సీఐ గోదాం ఇన్‌చార్జి నరసింహరావును వివరణ కోరగా.. బియ్యం పంపిణీలో తమ వైపు ఎలాంటి పొరపాటు లేదని తెలిపారు. నిబంధనల ప్రకారమే బియ్యం సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అధికారులు తక్షణమే స్పందించి రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి, డీలర్లకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

తెలుగు ట్రెండ్స్ – పాపన్నపేట
రిపోర్టర్: పి. శ్రీనివాస్

0/Post a Comment/Comments

ads

ads