బస్సు కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. మరో సర్వీస్‌ కోసం వినతి


 ఒక్క బస్సుతో విద్యార్థుల అగచాట్లు


అన్నారం–అబ్లాపూర్‌–గాజులగూడెం మీదుగా కొడపాక వరకు మరో బస్సు ఏర్పాటు చేయాలి


మెదక్, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామ విద్యార్థులు, ప్రజలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కష్టంగా మారింది. మెదక్‌ నుంచి కొడపాకకు ప్రస్తుతం ఒకే ఒక్క బస్సు సర్వీసు నడుస్తుండటంతో అన్నారం, అబ్లాపూర్‌, గాజులగూడెం గ్రామాల విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గతంలో రెండు సర్వీసులతో ఇబ్బందులు తక్కువ


గతంలో మెదక్‌ నుంచి నాగ్సన్‌పల్లి మీదుగా కొడపాకకు ఒక బస్సు సర్వీసు ఉండటంతో పాటు మరో సర్వీసు అన్నారం, అబ్లాపూర్‌, గాజులగూడెం మీదుగా కొడపాకకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి మెదక్‌కు వచ్చేది. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు కొంతమేర రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే ఏడుపాయల వైపు నుంచి కొడపాకకు వచ్చే బస్సు సర్వీసు నిలిచిపోవడంతో ప్రస్తుతం మెదక్‌–కొడపాక మార్గంలో నడుస్తున్న ఒకే ఒక్క బస్సుపైనే ప్రయాణికులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అన్నారం చేరుకునేలోపే నిండిపోతున్న బస్సు


కొడపాక నుంచి వచ్చే విద్యార్థులు, ప్రయాణికులతో బస్సు ముందుగానే నిండిపోతుండటంతో అన్నారం గ్రామానికి చేరుకునే సమయానికి ఖాళీ లేకుండా పోతుందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో అన్నారం గ్రామంలో బస్సు నిలిపినా విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకునే పరిస్థితి లేకపోవడంతో కొన్నిసార్లు బస్సు ఆగకుండా వెళ్లిపోతున్నట్లు వారు పేర్కొంటున్నారు.


విద్యార్థులకు తప్పని ఇబ్బందులు


ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు బస్సు కోసం రోడ్డుపై గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. బస్సు వచ్చినా ఎక్కేందుకు అవకాశం లేకపోవడంతో విద్యాసంస్థలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరో బస్సు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి


ప్రస్తుతం నడుస్తున్న ఒకే ఒక్క సర్వీసు కొడపాక నుంచే ప్రయాణికులతో నిండిపోవడంతో అన్నారం, అబ్లాపూర్‌, గాజులగూడెం గ్రామాల ప్రజలకు సరైన రవాణా సౌకర్యం అందడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉదయం వేళ అదనపు బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.


అన్నారం–అబ్లాపూర్‌–గాజులగూడెం గ్రామాల మీదుగా కొడపాక వరకు మరో బస్సు సర్వీసును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి మెదక్‌కు తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులతో పాటు ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఉన్న బస్సు సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు విద్యార్థుల రాకపోకలకు అనుకూలంగా అదనపు సర్వీసు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.


ఆర్టీసీ అధికారులు స్పందించాలి


విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెదక్‌ ఆర్టీసీ డిపో అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అన్నారం గ్రామంలో బస్సు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకునే విధంగా అదనపు బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ విషయమై మెదక్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ పరమేశ్వరిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.


పాపన్నపేట రిపోర్టర్‌: పి. శ్రీనివాస్

తెలుగు ట్రెండ్స్ 



0/Post a Comment/Comments

ads

ads