ఓటరు జాబితాపై గ్రామసభల సందడి మీ పేరు జాబితాలో ఉందా? వివరాలు సరిచూసుకోండి

 



ఓటరు జాబితాపై గ్రామసభల సందడి

జాబితాలో మీ పేరు ఉందా.. వివరాలు సరిగా ఉన్నాయా?

పేర్లు, వివరాల్లో తప్పులుంటే అధికారులకు తెలియజేయాలి: తహసీల్దార్‌ విజయలక్ష్మి

వెల్దుర్తి, ఆగస్టు 27 (నవ పలుకులు): ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో భాగంగా వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నిర్వహించిన గ్రామసభల్లో పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోని ముసాయిదా ఓటరు జాబితాలను ప్రజలకు చదివి వినిపించారు.

ఎస్‌ఐఆర్‌ సర్వేలో గుర్తించిన మరణించిన వ్యక్తులు, వివాహం అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, గ్రామంలో ప్రస్తుతం నివాసం లేని వ్యక్తుల పేర్లను గ్రామసభల్లో పరిశీలించారు. సంబంధిత కుటుంబ సభ్యుల వివరాలను సైతం పరిశీలించి, అవసరమైన చోట మ్యాపింగ్‌ చేసి ఓటరు జాబితాలో సవరణలు చేసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా తహసీల్దార్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటరు పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉన్నా, అర్హత ఉన్నప్పటికీ ఎవరి పేరు జాబితాలో లేకపోయినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

అదేవిధంగా మరణించిన వ్యక్తుల పేర్లు లేదా గ్రామంలో నివాసం లేని వ్యక్తుల పేర్లు జాబితాలో కొనసాగుతున్నట్లు గుర్తించినా అధికారులకు సమాచారం ఇవ్వాలని తహసీల్దార్‌ సూచించారు. ప్రజలు ఓటరు జాబితాను స్వయంగా పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత సమయంలో బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని విజయలక్ష్మి కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, అనర్హులైన లేదా మార్పు అవసరమైన వివరాలను నిబంధనల ప్రకారం సరిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామసభల్లో ఆర్‌ఐ నర్సింహ యాదవ్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, బీఎల్‌ఓలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నవ పలుకులు – రిపోర్టర్‌: ఎన్‌. నర్సింహా గౌడ్‌, వెల్దుర్తి

0/Post a Comment/Comments

ads

ads