ఉస్మానియా వైద్యుల ఘనత.. దేశంలోనే తొలి మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతం
హైదరాబాద్:
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు మరోసారి చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఒకేసారి ఐదు కీలక అవయవాల (మల్టీ-విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కడుపు (స్టమక్), డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు (రైట్ కోలన్) అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించారు.
ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు ఈ అరుదైన శస్త్రచికిత్సను ఉస్మానియా ఆసుపత్రి నిపుణుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత పెంచిందని పేర్కొన్నారు.
ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేసిన వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, క్రిటికల్ కేర్ బృందం, ఇతర సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా వైద్యుల ఈ ఘనత నిదర్శనమని, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అత్యున్నత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తోందని ఆయన తెలిపారు.

إرسال تعليق